ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, సెప్టెంబర్ 30: కరీంనగర్ నూతన సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్, పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రోటోకాల్, భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్యం, రవాణా తదితర విభాగాల సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమాల నిర్వహణలో తమ వంతు సహకారం అందించిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమష్టిగా చేసిన కృషి అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం కీలకంగా నిలిచిందన్నారు.జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా కనిపించిన సమష్టి స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కరీంనగర్ జిల్లాను అభివృద్ధి సూచికల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.





























