నేరస్థులపై ఉక్కుపాదం.. పెట్టుబడులకు కొత్త చిరునామా
12 ఏళ్లలో 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం
80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు.. పేదలకు శాశ్వత గృహాలు
రూ.34,470 కోట్ల అభివృద్ధి పనులు జాతికి అంకితం
ప్రతిపక్షం నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ, నవంబర్ 21: ఒకప్పుడు కుంభకోణాలు, నేరాలకు చిరునామాగా ఉన్న బిహార్.. ఇప్పుడు పెట్టుబడులు, అభివృద్ధి, నేరస్థులపై కఠిన చర్యలకు వేదికగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్డీఏ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ దశాబ్దాల పాటు ‘గరీబీ హఠావో’ నినాదానికే పరిమితమైందని, తమ ప్రభుత్వం 12 ఏళ్లలోనే సుమారు 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని వెల్లడించారు. శనివారం బిహార్లో పర్యటించిన మోడీ.. గంగా నదిపై దర్గా, బిదుపుర్లను కలుపుతూ నిర్మించిన ఆరు వరుసల కేబుల్ వంతెనను ప్రారంభించి ‘నీతీశ్ సేతు’గా నామకరణం చేశారు. అనంతరం వైశాలిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో సుమారు రూ.34,470 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
రాకపోకలకు కొత్త మార్గం
గంగానదిపై నిర్మించిన ఆరు వరుసల నీతీశ్ సేతు.. పట్నా, వైశాలి మధ్య రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందని మోడీ తెలిపారు. ప్రయాణ దూరం, సమయం తగ్గడంతోపాటు ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు వీలవుతుందన్నారు. యువతకు విద్య, వృద్ధులకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మౌలిక సదుపాయాల కల సాకారమవుతోందని చెప్పారు.
పేదరికంపై పోరులో ముందడుగు
పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మోడీ స్పష్టం చేశారు. దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తున్నామని, లక్షలాది కుటుంబాలకు శాశ్వత గృహాలు నిర్మించి ఇచ్చామని తెలిపారు. ఉచిత వైద్య చికిత్స పథకాలతో సామాన్యులపై ఆరోగ్య ఖర్చుల భారం తగ్గిందన్నారు. పేదలకు కనీస అవసరాలు, భద్రత కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే పేదరిక నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు.
100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
పట్టణ ప్రజా రవాణాను బలోపేతం చేయడంతోపాటు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో బిహార్లో 100 ఎలక్ట్రిక్ బస్సులను మోడీ ప్రారంభించారు. రోడ్డు అనుసంధానం, ఇంధనం, పట్టణ మౌలిక సదుపాయాలు, నీటి వనరులు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ పాల్గొన్నారు. బిహార్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల అవసరాలను ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కరిస్తోందని ఆయన పేర్కొన్నారు.
నీతీశ్ సుపరిపాలన కొనసాగింపు
బిహార్లో గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ఎన్డీఏ పాలనకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని మోడీ వ్యాఖ్యానించారు. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, నీతీశ్ కుమార్ అందించిన సుపరిపాలనను ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. దివంగత నేత రామ్ విలాస్ పాస్వాన్ ఆశయాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మోడీ నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో 2037 నాటికి సమృద్ధ బిహార్, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


























