ప్రతిపక్షం, సెప్టెంబర్ 06: హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు హత్యాచారానికి గురైన ఘటనను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నిజానిజాలు వెలికితీసేందుకు మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా, కేసు విచారణలో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులతో పాటు బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యం చోటుచేసుకుందా, మహిళా ఉద్యోగుల రక్షణకు పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా అనే అంశాలన్నింటినీ మెజిస్టీరియల్ విచారణలో సమగ్రంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఘటన వెనుక వ్యక్తిగత నేరంతో పాటు వ్యవస్థాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని కూడా గుర్తించాలని ఆదేశించారు.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాలు, కేసుకు సంబంధించిన అన్ని కీలక సాక్ష్యాలను వీలైనంత త్వరగా సేకరించాలని చెప్పారు. దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం అందించేందుకు ఈ కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా చేపట్టేందుకు అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేసి న్యాయ ప్రక్రియలో ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు.
ఈ ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
ఒక్క కేసులో నిందితుడిపై చర్యలు తీసుకోవడంతోనే సరిపెట్టకుండా, ఇటువంటి ఘటనలకు దారితీసే వ్యవస్థాపరమైన లోపాలను కూడా గుర్తించి సరిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థలు, ఆస్పత్రులు, మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు, వారు నివసించే వసతి కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మహిళా ఉద్యోగుల భద్రత విషయంలో నిర్లక్ష్యం బయటపడితే సంబంధిత వారిపై బాధ్యత నిర్ణయించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా విచారణ పూర్తయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తుక్కుగూడ ఘటనపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా వ్యవహరిస్తోందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఘటనకు కారణమైన లోపాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.





























