- కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి.
- ఏఐటీయూసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్ కౌర్.
- ఏఐటీయూసి రాష్ట్ర మహాసభల బహిరంగ సభలో వక్తలు
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 06: కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే మార్గమని.. చరిత్ర అదే చెబుతుందని..ప్రస్తుతం అమలులో ఉన్న హక్కులు ఎన్నో పోరాటాలు.. ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగానే సాధించుకున్నామని ఏఐటియూసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ తెలిపారు. కార్మికులు సాధించకున్న హక్కులను, చట్టాలను కాలరాసే పనిలో దేశంలోని పాలకులు ఉన్నారని అందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయూసి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు కరీంనగర్ లో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ తెలంగాణ చౌక్ లోని సర్కస్ గ్రౌండ్ వరకు సాగింది. అనంతరం సర్కస్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో వక్తులు ప్రసంగించారు.
బహిరంగ సభకు ఏఐటీయూసి రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ యూసుప్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా ఏఐటీయూసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏఐటీయూసీ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, ఇది కేవలం జెండా మాత్రమే కాదని.. ఈ దేశ కార్మికుల చరిత్ర అని.. మన దేశ శ్రామికుల జీవితాలతో ముడిపడి ఉన్న జెండా అని.. కార్మిక ఉద్యమమే యావత్ ప్రపంచానికి మానవ హక్కుల పాఠాన్ని నేర్పిందని గుర్తుచేశారు. 14 గంటలు, 18 గంటలు, 20 గంటలు కష్టపడి పనిచేసినా కడుపునిండా తిండి దొరకని పరిస్థతి, భద్రత లేని స్థితి నుంచి 8 గంటల పని విధానం కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నామని అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం మొట్టమొదట ఆ హక్కునే లాక్కుంటోందని, ప్రపంచవ్యాప్త కార్మికులు, మన దేశ కార్మికులు చేసిన శ్రమను, త్యాగాలను చెత్తబుట్టలో వేస్తోందని, సమ్మె చేసే హక్కును లాక్కోవడం, నిర్ణీత పని గంటలను రద్దు చేయడం, సామాజిక భద్రతను దూరం చేయడం, పని ప్రదేశంలో భద్రత కల్పించకపోవడం, వేతనాలు పడిపోతున్నా పట్టించుకోకపోవడం చేస్తోందని ఆరోపించారు. కార్మికుడు సృష్టించిన సంపదను అదానీ, అంబానీలకు, ప్రపంచ, దేశీయ కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే మార్గంలో ఈ ప్రభుత్వం పయనిస్తోందని విమర్శించారు. కార్మిక చట్టాల స్థానంలో నూతనంగా నాలుగు లేబర్ కోడ్‌లను ప్రవేశ పెట్టి కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాసే పనిలో ఉన్నారని, వాటి రద్దు కోసం కార్మిక లోకం ఏకమై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సైమన్ కమిషన్, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లోను ఏఐటీయూసి పాత్ర మరువ లేనిదని గుర్తు చేశారు.
ఏఐటీయూసీ అనేది చరిత్ర గర్భం నుంచి పుట్టిందని అందుకే ఏఐటీయూసీని మదర్ ఆర్గనైజేషన్ (తల్లి సంస్థ) అంటారని, అన్ని ట్రేడ్ యూనియన్లు దీన్ని తమ తల్లిగా భావిస్తాయని అన్నారు. దేశ ప్రజలందరు కుల మతాలకతీతంగా భారతీయులుగా దేశం కోసం, హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు ఆర్‌ఎస్ఎస్ ఏం చేసిందో.. ఆర్‌ఎస్ఎస్ అయిన నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఏఐటీయూసీ, ఈ రోజు దేశాన్ని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి కూడా పోరాడుతుందని, కష్టపడి నిర్మించిన దేశాన్ని నాశనం చేసేవారిపై తిరుగుబాటు చేస్తుందని, స్వాతంత్య్ర సమరయోధులు ఆశించిన సామ్యవాద సమాజ స్థాపన కోసం శ్రమిస్తుందని అన్నారు. దేశంలో 70 శాతం జనాభా 35 ఏళ్లలోపు యువత అని,వారికి సరైన విద్య, ఉపాధి లేక యువత అల్లాడుతోతున్నారని, అందుకే జంతర్ మంతర్ వద్ద ఉద్యమాలు పుట్టుకొచ్చాయన్నారు.
- ప్రతి రంగంలో కార్మిక సంఘాలను బలోపేతం చేయాలి: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
కరీంనగర్ పట్టణంలో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, సృష్టి ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని, భూమి, నీరు, ఆకాశం, వెలుతురు ఎలా శాశ్వతమో ఎరుపు కూడా అలాగే శాశ్వతమని అన్నారు. సృష్టి ఉన్నంతకాలం మనుషులు ఉంటారని, మనుషుల జీవనానికి భూమి, నీరు, గాలి, వెలుతురు ఎంత అవసరమో, అదే విధంగా ప్రజల హక్కుల కోసం ఎర్రజెండా కూడా అవసరమని అన్నారు. ఎర్రజెండా ఉన్నంతకాలం ప్రజా, కార్మిక పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ పోరాటాల నుంచి వెనక్కి తగ్గరని, రాజకీయ పొత్తులు, రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ పొత్తులు పొత్తులే, పోరాటం పోరాటమే అని అన్నారు. కార్మికుల సమస్యలపై రాజీ లేకుండా పోరాటాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీతో పాటు వైద్య, బ్యాంకింగ్, సేవారంగం తదితర అన్ని రంగాల్లో కార్మిక సంఘాలను బలోపేతం చేయాలని కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఇంకా సంఘాలు లేని రంగాల్లో కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అంగన్‌వాడీ, స్కీమ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వంట కార్మికులు, పిల్లల సంరక్షణలో పనిచేసేవారు, ఉపాధ్యాయులు, ఇతర సేవారంగ కార్మికులు ఇలా ప్రతి రంగంలోని కార్మికులను సంఘటితం చేయాలని సూచించారు.తదుపరి మహాసభ నాటికి ప్రస్తుతం సంఘాలు లేని రంగాల్లో కూడా సంఘాలను ఏర్పాటు చేసి, వంద నుంచి నూట యాభై వరకు కొత్త కార్మిక సంఘాలను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రతి సంఘంలో ఏఐటీయూసీ గొంతు వినిపించాలని, ప్రతి కార్మికుడి సమస్యపై ఏఐటీయూసీ ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు.
*కార్మిక హక్కుల సాధనకు రణభేరి మోగిస్తాం: సీపీఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి *
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో, కార్మిక హక్కుల సాధనలో ఏఐటీయూసీ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి, నరేంద్ర మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. దీనివల్ల సమ్మె చేసే హక్కు, ప్రశ్నించే గొంతుక లేకుండా పోతున్నాయని, వెంటనే ఈ నాలుగు కోడ్లను రద్దు చేయకపోతే తాడోపేడో తేల్చుకునే సార్వత్రిక పోరాటాలకు కార్మిక సంఘాలు సిద్ధమవుతాయని హెచ్చరించారు. అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, హమాలీలు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యం, విద్యా రంగాల్లో కూడా ఔట్‌సోర్సింగ్ పెట్టి దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుమారు 25 వేల మంది పేర్లతో బోగస్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు జీతాలను స్వాహా చేస్తున్నాయని, పనిచేసే కార్మికులకు మాత్రం న్యాయమైన వేతనాలు అందడం లేదని ఆరోపించారు. ఈ దోపిడీపై ప్రభుత్వం కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్ రావు రక్తం చిందించిన కరీంనగర్ గడ్డపై నుంచే కార్మిక హక్కుల పరిరక్షణ కోసం రణభేరి మోగిస్తామని పిలుపునిచ్చారు.
- కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలి: సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి
కరీంనగర్‌లో నిర్వహించిన ఏఐటీయూసీ బహిరంగ సభలో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ కరీంనగర్ పోరాటాలకు, విప్లవాలకు కేరాఫ్ అడ్రస్ అని, తెలంగాణ సాయుధ పోరాటంలో అనభేరి ప్రభాకరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ఎందరో యోధులు ప్రాణత్యాగం చేసిన నేల ఇదని కొనియాడారు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సింగరేణి కార్మికులను ‘చీకటి సూర్యులు’గా అభివర్ణిస్తూ, దేశ నిర్మాణంలో కార్మికులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, బీడీ, సిరిసిల్ల చేనేత మరియు హమాలీ కార్మికులు సమాజానికి విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే పాలకుల విధానాల వల్ల నేడు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చికాగో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పనిదినాలు కాలరాయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ దేశ సంపదను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, శ్రమకు తగిన వేతనం సాధించేందుకు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కార్మికులంతా ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీలన్నీ పూర్వం పిడికిలి బిగించినట్లు ఒక్క తాటిపై ఒకే కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నట్లు ఇప్పుడు కూడా విడి విడి గా ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమై ఒకే పార్టీ గా ఉండ డానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్ రావు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ప్యాట్రన్ కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు వి.ఎస్.బోస్,ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య,కోశాధికారి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య,డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం. నర్సింహా, ఆఫీస్ బేరర్స్ ప్రేమ్ పావని, దేవేందర్ రెడ్డి, విలాస్, ఇమ్రాన్,వెంకటేష్, శ్రీనివాస్,క్లైమేట్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ,వివిధ జిల్లాల సిపిఐ కార్యదర్శులు ,రామడుగు లక్ష్మణ్,తాండ్ర సదానందం,చెన్న విశ్వనాథం,మంద సుదర్శన్,కరీంనగర్ జిల్లా నాయకులు పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బోయిని తిరుపతి,పిట్టల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కసి రెడ్డి మణికంఠ రెడ్డి,రమేష్,యుగేందర్,అంజలి తదితరులు పాల్గొన్నారు.

































