- రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 06: టీపీసీసీ ఎస్సీ సెల్‌ను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేసి, దళితుల సమస్యల పరిష్కారానికి చురుకైన వేదికగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆదివారం టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎస్సీ సెల్ జాతీయ నాయకులు కొప్పుల రాజు, జాతీయ కోఆర్డినేటర్ సిద్దార్థ్ హితంబ్రే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ సెల్ కార్యకలాపాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, దళితుల సమస్యలపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎస్సీ సెల్‌ను క్రియాశీలం చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరాన్ని నాయకులు ప్రస్తావించారు.గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. దళితుల హక్కులు, రాజ్యాంగ విలువలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని దిశానిర్దేశం చేశారు.కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఎస్సీ వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.





























