ప్రతిపక్షం, ఆగస్టు 10: బోనాల పండుగ సందర్భంగా బంధుమిత్రులను ఇంటికి పిలిచి దావత్ చేసుకోవడం హైదరాబాద్ సంస్కృతిలో భాగం. అయితే పండుగ విందు విషాదంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మిగిలిపోయిన చికెన్, మటన్, బోటీ వంటి మాంసాహారాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మరుసటి రోజు తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
గతేడాది వనస్థలిపురంలో జరిగిన ఘటనను వైద్యులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఓ కుటుంబం బోనాల సందర్భంగా చికెన్, బోటీ వండుకుని.. మిగిలిన ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో భద్రపరిచింది. మరుసటి రోజు ఆ మాంసాహారాన్ని తిన్న కుటుంబ సభ్యుల్లో పలువురికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 9 మంది ఆస్పత్రిలో చేరగా.. కుటుంబ పెద్ద శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మాంసాహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, ఎక్కువసేపు బయట ఉంచడం లేదా తిరిగి సరిగ్గా వేడి చేయకుండా తినడం వల్ల ఆహార విషబాధకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో పెద్ద మొత్తంలో వంట చేయడం, ఎక్కువసేపు బయట ఉంచడం వల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం పెరుగుతుంది.
వండిన మాంసాహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచకుండా తగిన విధంగా భద్రపరచాలని, నిల్వ చేసిన ఆహారాన్ని తినే ముందు పూర్తిగా వేడి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం వాసన, రంగు లేదా రుచి మారినట్లు అనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని హెచ్చరిస్తున్నారు.
బోనాల పండుగ సందర్భంగా ఆనందంగా నిర్వహించే దావత్.. అనారోగ్యానికి కారణం కాకుండా ఆహార భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.





























