ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: ఎక్కువ కాలం ఒంటరిగా జీవించడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇతరులతో సామాజిక సంబంధాలు లేకుండా, ఇష్టం లేకుండా ఒంటరితనంలో గడిపే పరిస్థితి దీర్ఘకాలంలో గుండె జబ్బులు, పక్షవాతం, జ్ఞాపకశక్తి క్షీణత వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ఒంటరితనం ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
ఒంటరితనం మెదడు పనితీరుతో పాటు రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ కాలం సామాజికంగా దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, వ్యక్తి ఆరోగ్యంపై పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అందువల్ల ఒంటరిగా ఉండటం, ఒంటరితనాన్ని అనుభవించడం రెండింటినీ ఒకేలా చూడకూడదని సూచిస్తున్నారు.
తనకు నచ్చిన విధంగా కొంత సమయం ఒంటరిగా గడపడం తప్పు కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. విశ్రాంతి కోసం లేదా వ్యక్తిగత సమయం కోసం స్వచ్ఛందంగా ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి తప్పనిసరిగా హానికరం కాదని చెబుతున్నారు. అయితే ఇష్టం లేకపోయినా ఇతరులకు దూరంగా ఉండాల్సి రావడం, మాట్లాడేందుకు లేదా కలిసేందుకు ఎవరూ లేకపోవడం వంటి పరిస్థితులు కొనసాగితే మాత్రం జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో పిల్లలు, యువత ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో గడుపుతూ ప్రత్యక్ష మానవ సంబంధాలకు దూరమవుతున్న పరిస్థితిపై కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నియంత్రించడంతో పాటు స్నేహితులతో సమయం గడపడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అలవాట్లను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
మానవ సంబంధాలు మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులతో సన్నిహితంగా ఉండటం వల్ల ఒంటరితనం తగ్గడంతో పాటు భావోద్వేగపరమైన మద్దతు లభిస్తుందని పేర్కొంటున్నారు. అందుకే పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలను కొనసాగించేలా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.



























