తుప్రాన్ డీఎస్పీని విచారణ అధికారి బాధ్యతల నుంచి మార్చాలి
48 గంటల నిరాహార దీక్షలు ప్రారంభం.
నవంబర్ 20లోపు అరెస్టులు లేకుంటే సీఎం క్యాంపు కార్యాలయానికి పాదయాత్ర
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, నవంబర్ 11: కొనాయపల్లి గ్రామ దళితులపై దాడికి పాల్పడిన గ్రామ సర్పంచ్ మన్నె కళ్యాణ్‌తో పాటు ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న తుప్రాన్ డీఎస్పీని మార్చాలని డిమాండ్ చేస్తూ దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎదుట 48 గంటల నిరాహార దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి.ఈ దీక్షలను ప్రారంభించిన కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా దళితులపై దాడులకు కేంద్రంగా మారుతోందని, జిల్లాలో దళితులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ 18న కొనాయపల్లి, నవాబ్‌పేట కుచారం, కిష్టాపూర్, ఎదులపల్లి గ్రామాల్లో దళితులపై దాడులు జరిగినట్లు తెలిపారు. బాధితులు తుప్రాన్, మనోహరాబాద్, శివ్వంపేట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినప్పటికీ కేసుల నమోదు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
దాడుల తీవ్రతకు అనుగుణంగా కేసులు నమోదు చేయలేదని, బాధితులకు మెరుగైన వైద్యం అందించే విషయంలోనూ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కొనాయపల్లిలో గ్రామ సర్పంచ్, ఆయన అనుచరులు మూకుమ్మడిగా దళితులపై దాడి చేసి గాయపరిచారని పేర్కొన్నారు. బాధితులు 21 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. అక్టోబర్ 22న వినతిపత్రం అందించినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.1989 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, దాడులు జరిగిన గ్రామాలను కలెక్టర్, ఎస్పీ సందర్శించి బాధితులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కొనాయపల్లి సర్పంచ్‌పై నమోదైన అట్రాసిటీ కేసులో తగిన సెక్షన్లు చేర్చాలని, దళితులను కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మరాజుపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకుడు విఠల్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
దళితులపై దాడులకు పాల్పడిన వారిని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు తుంకుంట నర్సిరెడ్డి ఎందుకు కాపాడుతున్నారని వారు ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని, పంచాయతీ కార్మికులపై దాడి ఘటనను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎల్పీవో విచారణ పూర్తయినా చర్యలు తీసుకోకపోవడంపై నిలదీశారు. కేసు రాజీ కోసం పంచాయతీ కార్యదర్శి దళితులపై ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు.జిల్లాలో దళితులపై జరిగిన దాడులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనాయపల్లి దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నవంబర్ 20లోపు నిందితులను అరెస్ట్ చేయకపోతే కొనాయపల్లి నుంచి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంసీఎఫ్ నాయకుడు జెల్ల సుధాకర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కల్లూరి సంజీవ, టీఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మన్నె బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు జె. కుమార్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాసి సంజీవులు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె. నిరంజన్ దాసు, జిల్లా కమిటీ సభ్యుడు కె. నాగరాజు, ఏఐఏడబ్ల్యూయూ జిల్లా కార్యదర్శి కె. మల్లేష్, ఎన్పీఆర్డీ జిల్లా కార్యదర్శి కె. యశోద, నాయకులు యాదగిరి, కవిత, వెంకన్న, డీబీఎఫ్ తుప్రాన్ డివిజన్ అధ్యక్షుడు పంచమి చంద్రం తదితరులతో పాటు కొనాయపల్లి గ్రామ దళితులు రవెల్లి ప్రవీణ్, రవెల్లి గురుదాసు, రవెల్లి నిరంజన్ దాసు, రవెల్లి అర్జున్, రవెల్లి గిరిప్రసాద్, అండాలు, శ్రావణి, అంశమ్మ, ప్రమీల, సత్యమ్మ, లలిత, రేణుక పాల్గొన్నారు.






























