[t4b-ticker]

అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగొద్దు.. ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి కీలక లేఖ

ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో అనర్హులైన వారు ఓటర్ల జాబితాలో చేరకుండా కఠినమైన, పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఓటర్లకు అభ్యంతరాలు, ఫిర్యాదులు, అవసరమైన పత్రాలు సమర్పించేందుకు మరింత సమయం కల్పించడంతో పాటు.. వారికి తగిన సహాయం అందించేలా విధానపరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం.. 2026 జూన్ 10 నాటికి తెలంగాణలో సుమారు 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 73.39 లక్షల మందిని గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా గుర్తించినట్లు ఎన్నికల సంఘం గణాంకాలను ఆయన ప్రస్తావించారు. మొత్తం ఓటర్లలో ఇది సుమారు 21.7 శాతంగా ఉందని తెలిపారు. ఈ వర్గంలో దాదాపు 62 శాతం అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళన కలిగించే అంశమని సీఎం పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా గణన పత్రాల డిజిటలైజేషన్‌లోనూ పెద్ద సంఖ్యలో లోపాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి లేఖలో వివరించారు. మొత్తం 2.65 కోట్ల డిజిటలైజ్ చేసిన గణన పత్రాల్లో సుమారు 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉన్నాయని తెలిపారు. మరో 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం జరగలేదని పేర్కొన్నారు. ఈ రెండు వర్గాలను కలిపితే సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లపై ప్రభావం చూపే అంశమని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలకమైన లోపాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే సమయంలో తాత్కాలికంగా ఇంట్లో లేని వ్యక్తులను, శాశ్వతంగా మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న వారిని ఒకే విధంగా పరిగణించే పరిస్థితి ఉందని తెలిపారు. ఉద్యోగం, విద్య, వ్యాపారం లేదా ఇతర కారణాలతో కొంతకాలం ఇంట్లో లేని వ్యక్తులను కూడా నివాసం మార్చిన వారిగా పరిగణిస్తే నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నిజంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నివాసం మార్చుకున్న ఓటర్ల విషయంలోనూ వారికి సరైన సహాయం అందించకుండా పాత ప్రాంతంలోని ఓటు తొలగించే పరిస్థితి ఉండకూడదని సీఎం సూచించారు. కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం-6 ద్వారా అవసరమైన సహాయం అందించాలని కోరారు. ఒక వ్యక్తి పాత ప్రాంతం నుంచి ఓటు తొలగించబడే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఓటు హక్కు తొలగించబడిన విషయం ఒక ఓటరుకు పోలింగ్ రోజు వరకు తెలియకపోతే అది తీవ్రమైన సమస్యగా మారుతుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత తన పేరు జాబితాలో లేదని తెలుసుకునే పరిస్థితి ఏర్పడటం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల ఓటరు పేరు తొలగించే ముందు సంబంధిత వ్యక్తికి సమాచారం ఇచ్చి, తన అభ్యంతరాన్ని తెలియజేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.

పట్టణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. అలాగే పరిశీలన నోటీసుల్లో 41.9 శాతం కూడా ఈ మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని వివరించారు.

హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఉద్యోగాలు, వివాహాలు, విద్య, ఉపాధి వంటి కారణాలతో ప్రజలు తరచూ నివాసాలు మార్చుకుంటుంటారని సీఎం గుర్తుచేశారు. కొందరు తాత్కాలికంగా మరో ప్రాంతంలో నివసిస్తూ తమ కుటుంబ సభ్యులు ఉన్న పాత చిరునామాకు కూడా తరచూ వస్తుంటారని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో వారిని శాశ్వతంగా నివాసం మార్చిన వారిగా గుర్తించి ఓటు తొలగిస్తే అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేనందున ఓటర్ల జాబితా సవరణను మరింత సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు. అలాగే తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని అక్టోబర్ 19 నుంచి ముందుకు మార్చకుండా, అవసరమైన సవరణలు చేసేందుకు వీలుగా తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ముందుగానే విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం సూచించారు. కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రజల సమక్షంలో బహిరంగంగా చదివి వినిపించాలని కోరారు. దీనివల్ల తమ పేరు జాబితాలో ఉందా? లేదా? ఏదైనా తప్పు నమోదైందా? అనే విషయాలను ఓటర్లు స్వయంగా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

నోటీసులు అందుకున్న వారిలో రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు, ఇతర వర్గాలకు చెందిన వారు ఉండే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. వీరికి కేవలం వారం రోజుల వ్యవధిలో అవసరమైన పత్రాలను సమర్పించడం సాధ్యం కాకపోవచ్చని తెలిపారు. అందువల్ల కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్‌ కేంద్ర స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు ఏ పత్రాలు సమర్పించాలి? వాటిని ఎక్కడ పొందాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. అవసరమైన పత్రాలను పొందేందుకు కూడా ప్రజలకు సహకరించే వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వు 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా ఆధారాలుగా పరిగణించేలా అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. ఆధారాల జాబితాను విస్తరించడం ద్వారా నిజమైన ఓటర్లు తమ వివరాలను సులభంగా నిర్ధారించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్నాయని సీఎం తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో కేసులను పరిశీలించేందుకు కేవలం కొంతమంది అధికారులను నియమించడం సరిపోదని అన్నారు. ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించాలని కోరారు. నోటీసుల్లోనే విచారణకు సంబంధించిన నిర్దిష్ట తేదీ, సమయాన్ని స్పష్టంగా పేర్కొని.. ప్రజలకు అనుకూలంగా వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

మొత్తంగా తెలంగాణలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడం కంటే.. అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించడమే ముఖ్యమని సీఎం రేవంత్‌రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు. ఒకవైపు అనర్హుల పేర్లను తొలగిస్తూ.. మరోవైపు అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభలు, వార్డు సమావేశాల నిర్వహణతో పాటు అవసరమైన పరిపాలనా సహకారం అందిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరుకు తన ఓటు హక్కు భద్రంగా ఉండేలా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకంగా నిర్వహించాలని ఈసీని కోరడం ఈ లేఖలో ప్రధానంగా కనిపిస్తోంది.

Spread the love

Related News

Latest News