24 కిలోల మత్తు చాక్లెట్లు సీజ్-బీహార్ కు చెందిన వ్యక్తి అరెస్ట్
ప్రతిపక్షం, ఆగస్టు 29: శామీర్ పేట్ లో వెలుగుచూసిన గంజాయి చాక్లెట్ల దందా కలకలం రేపుతోంది. పాన్ షాప్ ముసుగులో, చిన్నారులు, యువతను టార్గెట్ చేస్తూ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ దాడిలో 5 వేలకు పైగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ మండలం తూంకుంట గ్రామం చంద్రారెడ్డి కాలనీలోని ప్లాట్ నంబర్ 05 లో పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆకస్మిక దాడి నిర్వహించారు.
ఈ దాడిలో బీహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లా గంగోలి గ్రామానికి చెందిన బిద్యానంద్ కుమార్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను తూంకుంటలో భార్య పూజా కుమారి, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటూ పాన్ షాప్ నడుపుతున్నాడు.తనిఖీలో ఇంట్లో 12 కవర్లలో ప్యాక్ చేసిన 5,298 గంజాయి చాక్లెట్లను గుర్తించారు. వాటి మొత్తం బరువు 24.59 కిలోలు. వీటితో పాటు ఒక వివో మొబైల్ ఫోన్ అమ్మకం ద్వారా వచ్చిన రూ,1,760 నగదు, మరియు చాక్లెట్లను దాచడానికి ఉపయోగించిన బ్రౌన్ సూట్ కేస్ ను స్వాధీనం చేసుకున్నారు.





























