ప్రతిపక్షం, ఆగస్టు 29: బీఆర్ఎస్ నేతల భద్రతను తొలగించి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం ఎలా కేటాయిస్తారని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. జానారెడ్డి ఏమైనా ముఖ్యమంత్రా అని నిలదీశారు. భద్రత విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులకు ఇద్దరు చొప్పున గన్‌మెన్లను కేటాయించడంపైనా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆరోపించారు. అదే సమయంలో ప్రతిపక్షానికి చెందిన బీఆర్ఎస్ నేతల భద్రతను తొలగించడం సరికాదని అన్నారు.
మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిని దాచింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డేనని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అలాగే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ ఉన్నారనే విషయం ప్రభుత్వానికి తెలిసినా ఆయనను అరెస్ట్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
భద్రతా అంశాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమాన ప్రమాణాలు పాటించాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.





























