[t4b-ticker]

దేశంలో స్వైన్‌ఫ్లూ కలకలం.. 17 రోజుల్లోనే 1,268 కేసులు నమోదు.. రాష్ట్రాల్లోనూ వేగంగా వ్యాప్తి

ప్రతిపక్షం, ఆగస్టు 29: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ముఖ్యంగా ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరిగింది. ఆగస్టు 10 నుంచి 27వ తేదీ వరకు కేవలం 17 రోజుల్లోనే ఢిల్లీలో 1,268 కొత్త స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 2,612కు చేరింది. ఇదే సమయంలో 3,300కు పైగా ఇన్‌ఫ్లుయెంజా-ఏ కేసులు కూడా నమోదైనట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

స్వైన్‌ఫ్లూ ప్రభావం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. మహారాష్ట్రలో ఆగస్టు 21 నాటికి 1,109 కేసులు నమోదయ్యాయి. ముంబై, పుణే ప్రాంతాల్లోనే దాదాపు 65 శాతం కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలో 4,212 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదవగా, బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే 3,081 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 364 కేసులు వెలుగుచూశాయి. లక్నోలో ఓ మహిళ మృతి చెందడంతో రాష్ట్రంలోని 75 జిల్లాల ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. రాజస్థాన్, తమిళనాడు, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.

అయితే దేశంలో వ్యాప్తి చెందుతున్న వైరస్‌ కొత్త రకం కాదని భారత వైద్య పరిశోధనా మండలి స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది సాధారణంగా ప్రతి ఏడాది కనిపించే కాలానుగుణ హెచ్‌1ఎన్‌1 పీడీఎం09 రకమేనని తెలిపింది. సాధారణ చికిత్సతో చాలా మంది కోలుకుంటారని పేర్కొంది.

స్వైన్‌ఫ్లూ సోకినవారిలో అధిక జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లునొప్పులు, తలనొప్పి, చలి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి తీవ్ర లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు గుంపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సూచన లేకుండా మందులు, యాంటీబయాటిక్స్‌ వాడకూడదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా, స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఫ్లూ టీకాలకు డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News