ప్రతిపక్షం, ఆగస్టు 29: తెలంగాణలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం కీలక సూచన చేసింది. కొత్తగా పెన్షన్ పొందేందుకు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31వ తేదీ చివరి గడువుగా నిర్ణయించడంతో అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా వితంతు పెన్షన్ల కోసం 2.34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగుల విభాగంలో 93,151 మంది దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన దరఖాస్తులు ఇతర అర్హతల కేటగిరీలకు సంబంధించినవిగా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన వారు పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వద్ద దరఖాస్తులు సమర్పించాలి. పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్ల వద్ద దరఖాస్తులు అందజేయాలని అధికారులు సూచించారు.
ఆన్లైన్లో దరఖాస్తు ఫారాలను పొందే అవకాశం కూడా కల్పించారు. ఇందుకోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన చేయూత అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31వ తేదీనే చివరి రోజు కావడంతో మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా అర్హులైన వారు వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.





























