ప్రతిపక్షం, ఆగస్టు 28: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ గనుల శాఖ అధికారి బి. జయరాజుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో గురువారం జయరాజుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా స్థిర, చర ఆస్తులతో పాటు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
జయరాజు ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గనుల శాఖ సహాయ సంచాలకుడిగా పనిచేస్తుండగా, వరంగల్ డిప్యూటీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తన అధికార పరిధిని ఉపయోగించుకుని ఇసుక రవాణా, ఇతర గనుల కాంట్రాక్టర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.
సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.3.06 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇందులో జీ+2 అంతస్తుల భవనం, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్, ఐదు ఖాళీ స్థలాలు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా రూ.10 లక్షల నగదు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు విలాసవంతమైన కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను కూడా సోదాల్లో గుర్తించినట్లు తెలిపారు.
ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన సమయంలో పోస్టాఫీసు పొదుపు ఖాతాల్లో రూ.20.86 లక్షలు, మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షల నగదు నిల్వలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు లెక్కలోకి వచ్చిన ఆస్తుల విలువ రూ.3.06 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్లో వాటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అయితే ఈ సోదాల్లో బయటపడిన వ్యవహారాల్లో డ్రైవర్ బ్యాంకు ఖాతా ద్వారా జయరాజు కుమార్తె ఖాతాకు నగదు బదిలీ అయిన అంశం అత్యంత కీలకంగా మారింది. జయరాజు వ్యక్తిగత డ్రైవర్ మొబైల్ ఫోన్, బ్యాంకు ఖాతాలను ఏసీబీ అధికారులు పరిశీలించగా.. అతడి ఖాతా నుంచి జయరాజు కుమార్తె బ్యాంకు ఖాతాకు విడతలవారీగా దాదాపు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు.
ఇసుక రవాణా, ఇతర గనుల కాంట్రాక్టర్ల నుంచి డ్రైవర్ ద్వారా డబ్బులు వసూలు చేయించి, అనంతరం ఆ మొత్తాన్ని జయరాజు కుమార్తె ఖాతాకు మళ్లించినట్లు విచారణలో డ్రైవర్ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో జయరాజు అక్రమ వసూళ్ల వ్యవహారంలో డ్రైవర్ను మధ్యవర్తిగా ఉపయోగించుకున్నారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఏయే వ్యక్తుల నుంచి నగదు వసూలు చేశారు, ఎంత మొత్తంలో వసూలు చేశారు, ఆ నగదు ఏయే ఖాతాల ద్వారా బదిలీ అయింది, ఈ లావాదేవీల వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
అలాగే సోదాల్లో గుర్తించిన ఆస్తులు జయరాజు అధికారిక ఆదాయానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆస్తుల కొనుగోలు కోసం వినియోగించిన నగదు, బ్యాంకు లావాదేవీలు, పొదుపు ఖాతాలు, బంగారు ఆభరణాలు, వాహనాల కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం గుర్తించిన ఆస్తులు, నగదు, బ్యాంకు నిల్వలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, ఇతర ఆర్థిక లావాదేవీలను కలిపి జయరాజు ఆదాయ మార్గాలతో పోల్చి చూస్తున్నారు. అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ, వాటిని నేరుగా తన ఖాతాలో కాకుండా బంధువులు, సన్నిహితులు లేదా ఇతరుల ఖాతాల ద్వారా మళ్లించినా దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని ఈ కేసు మరోసారి స్పష్టం చేస్తోంది. జయరాజు వ్యవహారంలో కూడా డ్రైవర్ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు జరిగిన లావాదేవీలు ఏసీబీ దృష్టికి రావడంతో మొత్తం ఆర్థిక వ్యవహారం బయటపడినట్లు అధికారులు తెలిపారు.





























