ప్రతిపక్షం, జూలై 05: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని రైతుల అవసరాలకు వినియోగించడంలో విఫలమైందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. రైతులకు వాస్తవ పరిస్థితిని చూపించేందుకే తాము కన్నెపల్లికి వెళ్తున్నామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పర్యటనను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్‌తో బయల్దేరిన కేటీఆర్‌కు పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఆయన కాన్వాయ్‌లో నలభైకి పైగా వాహనాలు ఉండగా, మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బారికేడ్లను తొలగిస్తూ ముందుకు వెళ్లేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయగా, పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నీటిని రైతులకు అందిస్తే యూరియా సరఫరా, ధాన్యం కొనుగోలు, బోనస్ వంటి అంశాలపై ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే నీటిని ఎత్తిపోయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియకుండా తమ పర్యటనను అడ్డుకుంటోందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కన్నెపల్లి చేరుకుని రైతులకు వాస్తవాలను చూపిస్తామని స్పష్టం చేశారు. దీంతో కన్నెపల్లి పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

















