ప్రతిపక్షం, జూన్ 29: తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద తొలి విడతగా రూ.100 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రతి ఏడాది నాలుగు విడతల్లో నేరుగా విద్యార్థుల ఖాతాలకు చెల్లించేలా ప్రభుత్వం గతంలో జీవో నెం.8 జారీ చేసింది. ఫీజు బకాయిల చెల్లింపుపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆగస్టు 15లోపు బకాయిలన్నీ చెల్లించాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం తొలి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు రేపటి నుంచి అర్హులైన విద్యార్థుల ఖాతాల్లో జమ కానున్నాయి.

















