Trending Now

ఎన్నికల షెడ్యూల్ వేళ కలకలం.. కరీంనగర్‌లో భారీగా డబ్బు సీజ్..

రూ. 6.65 కోట్లు సీజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్​,ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: 18వ లోక్‌సభ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూలు విడుదల కానుంది. తెలంగాణలోనూ 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో భారీగా నగదు పట్టుపడటం కలకం రేపుతోంది. స్థానిక ప్రతిమ హోటల్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.6.65 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

హోటల్‌లోని పార్కింగ్ సెల్లార్ నుంచి డబ్బును తరలిస్తున్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. మరి కొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో భారీగా డబ్బు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈ హోటల్ బీఆర్ఎఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సంబంధీకులది కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేవని ఏసీపీ నరేందర్‌ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును కోర్టులో డిపాజిట్‌ చేస్తామని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ముందస్తుగా డబ్బును డంప్ చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరపుతున్నారు. అసలు డబ్బు ఎవరిది..? హోటల్‌కు ఎందుకు తీసుకొచ్చారు..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

Spread the love

Related News

Latest News