హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులకు పొడిగించిన సంగతి తెలిసిందే. అటు సోదాలు.. ఇటు రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో కవిత రిమాండ్ రిపోర్టును ఈడీ విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. తాజా ఈడీ అఫిడవిట్‌తో మేకా శరణ్ అనే కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈయనపై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈడీ.. కవితను అడిగి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. అయితే కవిత మాత్రం ఆయన వివరాలను చెప్పడం లేదని ఈడీ చెబుతోంది. గత ఏడు రోజులుగా కవిత విచారణకు సహకరించడం లేదని రిపోర్టులో ఈడీ తెలిపింది. ‘కవిత నుంచి మరింత సమాచారాన్ని సేకరించాలి. లిక్కర్ కేసులో మేకా శరణ్ పాల్గొన్నట్లు వెల్లడైంది.
కేసులో దర్యాప్తునకు సంబంధించిన సమాచారం శరణ్ దగ్గరుంది. కవిత మాత్రం శరణ్ ఎవరో తెలియదని చెబుతున్నారు. మేక శరణ్ విషయంలో దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇందులో భాగంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నాం. నలుగురు నుంచి వాంగ్మూలాలు తీసుకున్నాం. దర్యాప్తులో తేలిన విషయాలపై కవితను ప్రశ్నించాం. ఈడీ విచారణలో కవిత మొబైల్ డేటాను పరిశీలించాం. డేటా డిలీట్ చేశారని గుర్తించాం. కుటుంబ వ్యాపార వివరాలు, ఆర్థిక అంశాల పత్రాలు వివరాలు ఇవ్వాలని కోరాం. కవితను కుటుంబ సభ్యులు, న్యాయవాది కలిసే సమయంలో డాక్యుమెంట్స్ వివరాలను తెలియజేస్తానని చెప్పారు. ఇప్పటివరకూ ఎలాంటి డాక్యుమెంట్స్ అందించలేదు’ అని రిపోర్టులో ఈడీ పేర్కొంది. కాగా.. శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కవిత బంధువుల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో మేకా శరణ్ కూడా ఒక్కరు. అటు సోదాలు జరుగుతూ ఉండటం.. ఇటు కవిత మాత్రం అబ్బే తనకేమీ తెలియదని చెబుతుండటంతో.. కర్త, కర్మ, క్రియ మేకా శరణే అని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది.