ప్రతిపక్షం, జూన్ 15: హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఇప్పటికీ ఆమోదం ఇవ్వకపోవడం వివక్షతకు నిదర్శనమని అన్నారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తున్న నగరమని పేర్కొన్న సీఎం, మెట్రో విస్తరణకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరారు. అహ్మదాబాద్ వంటి నగరాల మెట్రో ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసిన కేంద్రం, హైదరాబాద్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణ నగర భవిష్యత్ రవాణా అవసరాలకు అత్యంత కీలకమని, రాజకీయాలకు అతీతంగా కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.















