ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లపై రాష్ట్రాలకే పూర్తి అధికారం: సుప్రీంకోర్టు

ప్రతిపక్షం, జూన్ 04: ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డబ్బులు పందెంగా పెట్టి ఆడే ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి గేమ్‌లను నియంత్రించడం లేదా నిషేధించడం రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూపొందించిన ఆన్‌లైన్ జూద నిరోధక చట్టాలను సవాల్ చేస్తూ గేమింగ్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం రాష్ట్రాల నిర్ణయాలను సమర్థించింది.

జూదం, బెట్టింగ్ అంశాలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని, ప్రజా ప్రయోజనాలు, సామాజిక సంక్షేమం దృష్ట్యా రాష్ట్రాలు నియంత్రణ చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం పేర్కొంది.

రమ్మీ, పోకర్ వంటి ఆటలు నైపుణ్యంపై ఆధారపడినవని గేమింగ్ సంస్థలు వాదించినప్పటికీ, డబ్బు పందెం చేరిన క్షణం నుంచి అవి జూద స్వరూపం దాలుస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

బెట్టింగ్, జూద కార్యకలాపాలను రాజ్యాంగ పరిరక్షణ పొందే సాధారణ వ్యాపారంగా పరిగణించలేమని, వాటిని నిర్వహించడం ఎవరికీ ప్రాథమిక హక్కు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ తీర్పుతో ఆన్‌లైన్ బెట్టింగ్, జూద నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత స్పష్టమైన చట్టబద్ధ అధికారం లభించినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News