ప్రతిపక్షం, జూలై 16: హైదరాబాద్‌లో జరుగుతున్న 12వ బ్రిక్స్ (BRICS) కార్మిక, ఉపాధి శాఖల మంత్రుల సదస్సు సందర్భంగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలతో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమై ఆతిథ్యం అందించారు. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల కార్మిక, ఉపాధి శాఖల మంత్రులతో సీఎం ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధుల గౌరవార్థం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విందును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌ను అంతర్జాతీయ సదస్సులు, పెట్టుబడులు, వాణిజ్య సమావేశాలకు అనువైన గ్లోబల్ గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలను ముఖ్యమంత్రి ప్రతినిధులకు వివరించినట్లు సమాచారం. బ్రిక్స్ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు, భవిష్యత్తులో పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యం, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ సమావేశాలు దోహదపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.




















