ఏఐతో హైదరాబాద్ ట్రాఫిక్‌కు స్మార్ట్ సొల్యూషన్.. ఫిజికల్ ఇంటెలిజెన్స్ అమలుకు సీఎం రేవంత్ సూచనలు

ప్రతిపక్షం, జూలై 02: హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆధునిక పరిష్కారాలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ పి. కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలు సంయుక్తంగా దేశంలో అమలు చేయనున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లన్నింటినీ ఒకే వేదికపై అనుసంధానం చేసి, వాతావరణ పరిస్థితులు, వాహనాల రద్దీ, అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సిగ్నళ్లు స్వయంచాలకంగా పనిచేసేలా ఏఐ సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందస్తుగా ప్రోగ్రామ్ చేసిన ఆదేశాలకే పరిమితం కాకుండా, నిరంతర అభ్యాసం ద్వారా పరిస్థితులను అర్థం చేసుకుని తగిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుందని సంస్థ ప్రతినిధులు వివరించారు. హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తే ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, అత్యవసర వాహనాలకు గ్రీన్ కారిడార్ కల్పించడం, విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, నగర మౌలిక వసతుల్లో తలెత్తే లోపాలను ముందుగానే గుర్తించి పరిష్కరించడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.

సెన్సర్లు, రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు సమన్వయంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన కాగ్నిటివ్ సిటీ రూపకల్పనలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అమలుకు సంబంధించి అనలాగ్, ఎంఈఐఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పరం మార్చుకున్నారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News