• అతివేగంతో వచ్చి.. డివైడరు మీదున్న స్థంభాన్ని ఢీకొట్టి!
• ప్రమాద తీవ్రత ధాటికి నుజ్జునుజ్జయిన కారు
• అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు.. అక్కడికక్కడే దుర్మరణం
• కారులో నుంచి రోడ్డు మీదకు ఎగిరిపడటంతో.. ఇద్దరి తలలకు బలమైన గాయాలు
• కంది గ్రామంలో తహసీల్దారు కార్యాలయానికి సమీపంలో ఘటన
• ఘటనాస్థలికి వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబసభ్యులు
• అతివేగంగా వచ్చి స్థంభాన్ని ఢీకొట్టినట్లు సీసీటీవీల్లో రికార్డు
• మృతులు శంకర్ పల్లి మండలం. గాజుల గూడేనికి చెందిన వారని తెలిపిన పోలీసులు
ప్రతిపక్షం, నవంబర్ 03, సంగారెడ్డి: కంది గ్రామంలో తహసీల్దారు కార్యాలయానికి అత్యంత సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకర్ పల్లి వైపు నుంచి సంగారెడ్డి వస్తున్న కారు అతివేగంగా రావడమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. డివైడర్ మధ్యలో ఉన్న స్థంభాన్ని ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రత ధాటికి కారు పైకప్పు మొత్తం ధ్వంసమైంది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన తమ కుటుంబసభ్యులు తిరిగి రాని లోకాలకు వెళ్లారని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
శంకర్ పల్లి నుంచి.. సంగారెడ్డి వైపు వస్తూ!
శంకర్ పల్లి మండలం గాజుల గూడెం గ్రామానికి చెందిన భార్యభర్తలు ఎల్లంకొండ నర్సింలు, నవనీత సోమవారం అర్ధరాత్రి సమయంలో గ్రామం నుంచి పయనమయ్యారు. శంకర్ పల్లి నుంచి సంగారెడ్డి వైపు వస్తున్నారు. కంది గ్రామంలో తహసీల్దారు కార్యాలయానికి సమీపంలో టర్నింగ్ ఉంది. అతివేగంతో వస్తున్న కారు ఒక్కసారిగా మూలమలుపు వద్ద అదుపు తప్పింది.
డివైడర్ మీదున్న స్థంభాన్ని ఢీకొట్టి!
డివైడర్ మీదున్న స్థంభాన్ని అతివేగంతో వస్తున్న కారు ఢీకొట్టింది. ఆ తర్వాత పల్టీలు కొట్టింది. టాప్ మొత్తం నుజ్జునుజ్జయింది. ఆ ప్రదేశంలోనే నవనీత కారులో నుంచి ఎగిరి అవతలివైపు రోడ్డుపై పడింది. కారు అలాగే దూసుకెళ్లింది. కాసేపటికి నర్సింలు కూడా ఎగిరి అవతల పడ్డారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో, వారిద్దరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలారు.
సీసీటీవీలో.. ప్రమాద దృశ్యాలు రికార్డు!
స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంద్రకరణ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను అంబులెన్సులో సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. అతివేగంగా రావడం, మూలమలుపు ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులకు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు.
కన్నీరు మున్నీరైన.. కుటుంబసభ్యులు!
కొంత సేపటి క్రితమే ఇంటి నుంచి బయలుదేరిన నర్సింలు, నవనీత ప్రమాదం బారిన పడ్డారని తెలుసుకున్న కుటుంబసభ్యులు ప్రమాద స్థలికి వచ్చారు. మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ‘ఎంత పని చేస్తివి కొడకా..’ అంటూ మహిళ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.































