ప్రతిపక్షం, ఆగస్టు 10: హోటళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించే వారికి మైక్రోసాఫ్ట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది.
‘క్యాప్టివ్ క్రంచ్’ పేరుతో జరుగుతున్న సైబర్ దాడుల్లో హ్యాకర్లు వైఫై వినియోగదారులను నకిలీ వెబ్‌పేజీలకు మళ్లించి, వాటి ద్వారా హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను పరికరాల్లోకి చొప్పించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఈ విధంగా పరికరాల్లోకి చొరబడిన మాల్‌వేర్ ద్వారా వినియోగదారుల పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారం, ఇతర సున్నితమైన డేటాను సేకరించే ప్రమాదం ఉందని పేర్కొంది.
కొన్ని సందర్భాల్లో పరికరంలోని మైక్రోఫోన్, కెమెరాను దుర్వినియోగం చేసి ఆడియో, వీడియోలను రికార్డ్ చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో వ్యక్తిగత గోప్యతకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించే సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, అనుమానాస్పద పేజీల్లో వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం, బ్యాంకింగ్ లేదా ఇతర కీలక లావాదేవీలు నిర్వహించడం వంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో పబ్లిక్ వైఫైకి బదులుగా మొబైల్ హాట్‌స్పాట్‌ను ఉపయోగించడం సురక్షితమైన మార్గమని చెబుతున్నారు. అలాగే పరికరాల్లో భద్రతా నవీకరణలను ఎప్పటికప్పుడు అమలు చేయడం, బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం, అనుమానాస్పద అనుమతులు కోరే అప్లికేషన్లను దూరంగా ఉంచడం ద్వారా సైబర్ ముప్పులను కొంతవరకు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.





























