ప్రతిపక్షం, జూలై 11: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట మండలం కొత్తగంగారం నాయక్‌పోడ్ గూడెంలో పర్యటించి స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె, నాయక్‌పోడ్ సమాజానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయ, విద్య, ఉద్యోగ, అభివృద్ధి రంగాల్లో ఈ వర్గానికి న్యాయం జరిగేలా తమ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. రాష్ట్రంలో ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే తెలంగాణ రక్షణ సేనను స్థాపించినట్లు తెలిపారు. పాత రాజకీయాలకు భిన్నంగా వెనుకబడిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.
నాయక్‌పోడ్ సమాజం ఇప్పటికీ తమ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. జనాభా లెక్కల్లో కూడా నాయక్‌పోడ్‌లను సరైన రీతిలో నమోదు చేయకపోవడం వారి అస్తిత్వానికే అవమానమని విమర్శించారు. ఈ వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు రావాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుడతామని ప్రకటించారు.
ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీలు, ముస్లింలు ఇంకా అభివృద్ధికి దూరంగా ఉన్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికంగా దేశం ఎంతో ముందుకు వెళ్లినా, కొన్ని గిరిజన గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమన్నారు. చదువుకు తగిన ఉద్యోగాలు, మహిళలకు ఉపాధి, పేదలకు గృహ రక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వ్యాపారం చేయాలనుకునే యువతకు తక్కువ వడ్డీతో రుణాలు అందే విధంగా ప్రత్యేక విధానాలు తీసుకొస్తామని చెప్పారు. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విద్యను ప్రాథమిక హక్కుగా భావించి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్య సేవలు కూడా ప్రతి పేదవారికి ఉచితంగా అందుబాటులో ఉండాలని, ఆరోగ్యశ్రీ వంటి పథకాల్లో ఉన్న పరిమితులను తొలగించాలని కవిత సూచించారు. యువత వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం ఇచ్చి ప్రభుత్వమే నేరుగా రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
వ్యవసాయంపై కూడా కవిత ప్రత్యేకంగా మాట్లాడారు. రైతులను నిజంగా రాజులుగా చూడాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ కార్యాలయాల్లో రైతులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎరువులు, యూరియా వంటి వ్యవసాయ అవసరాల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని మార్చి, రైతు గౌరవాన్ని కాపాడే విధానాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
సామాజిక తెలంగాణే తమ లక్ష్యమని పేర్కొన్న కవిత.. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఇచ్చిన హామీ పూర్తిగా నెరవేరలేదన్నారు. నాయక్‌పోడ్‌లతో పాటు అన్ని వెనుకబడిన వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు, నిధులు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
మహిళల సాధికారతకు తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, మహిళలు, యువత, గిరిజనులు, రైతులు కలిసి మార్పుకు నాంది పలకాలన్నారు. తమ పార్టీ ఏర్పడి 74 రోజులు మాత్రమే అయినప్పటికీ ప్రజల ఆశీర్వాదంతో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. యువత తమతో కలిసి నడవాలని పిలుపునిస్తూ, ఇతర పార్టీలకు భిన్నమైన రాజకీయాలను తెలంగాణ రక్షణ సేన అందిస్తుందని పేర్కొన్నారు.
















