ప్రతిపక్షం, జూలై 11: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దయ్యాలగూడలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజులో ఆరుగురిని హత్య చేయడంతో పాటు ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, రాజశేఖర్ తన ఇంట్లో నిద్రిస్తున్న భార్య, ఇద్దరు చిన్నారులు, అలాగే కుటుంబ సభ్యులను కత్తితో దారుణంగా హత్య చేశాడు. అనంతరం తనపై పోక్సో కేసు నమోదు చేసిన 17 ఏళ్ల బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తల్లి, నానమ్మపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ తర్వాత బాలికను గ్రామ శివారులోని చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. గతంలో ఇదే బాలిక ఫిర్యాదుతో రాజశేఖర్‌పై పోక్సో కేసు నమోదై, జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది.
ఒకే ఘటనలో భార్య, ఇద్దరు చిన్నారులు, బాలిక తల్లి, నానమ్మతో పాటు బాలిక మృతి చెందడంతో దయ్యాలగూడ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారులను సైతం అత్యంత కిరాతకంగా హత్య చేయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
సమాచారం అందుకున్న షాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు.
ఈ ఘటనపై పోలీసులు హత్య, లైంగిక దాడి, పోక్సో తదితర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, హత్యల క్రమం, ఇతర పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.
















