ప్రతిపక్షం, జూన్ 09: తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నానని నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు.
సీఎం స్థాయికి తగిన విధంగా వ్యవహరించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. తాను మాటలు మార్చే వ్యక్తిని కాదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడినని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల విషయంలో కేంద్రం ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించిన ఆయన, ఏ గ్యారంటీని పూర్తిగా అమలు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సాధారణ ప్రజల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ ప్రజలను నిరాశపరిచాయని అన్నారు. రాష్ట్రంలో భూ దోపిడీ పెరిగిందని, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉందని ఆరోపించారు.
బీజేపీ నేతలను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న కిషన్‌రెడ్డి, తమకు ఎవరి ధృవీకరణలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, రాజకీయ విమర్శలకు తాము భయపడబోమని అన్నారు.

















