ప్రతిపక్షం, జూలై 20: ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థ శాంసంగ్ అమెరికాలో భారీ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. సంస్థ అమెరికా ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీలోని ఎంగిల్‌వుడ్ క్లిఫ్స్ నుంచి టెక్సాస్‌లోని ప్లానోకు తరలించాలని నిర్ణయించింది. ఈ మార్పుల ప్రభావంతో వందలాది ఉద్యోగులపై ప్రభావం పడుతోంది.
కంపెనీ అంతర్గత వివరాల ప్రకారం.. ప్రధాన కార్యాలయం తరలింపు ప్రక్రియలో సుమారు 739 ఉద్యోగులపై ప్రభావం పడనుంది. వీరిలో పలువురికి టెక్సాస్‌లోని కొత్త కార్యాలయానికి బదిలీ అవకాశం కల్పించినట్లు సమాచారం. అయితే వ్యక్తిగత, కుటుంబ కారణాలతో బదిలీకి అంగీకరించని ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
మరోవైపు టెక్సాస్‌లోని ప్లానో కార్యాలయంలోనూ సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. మొబైల్ విభాగంతో పాటు ఇతర వ్యాపార విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. దీంతో శాంసంగ్ అమెరికా విభాగంలో చేపట్టిన తాజా మార్పులు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమయ్యాయి.
గత కొన్ని వారాల్లో సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందిన పలువురు సీనియర్ ఉద్యోగులు సంస్థను వీడినట్లు సమాచారం. 30 మందికి పైగా సీనియర్ అధికారులు తమ రాజీనామాలు లేదా సంస్థ నుంచి వైదొలగుతున్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించినట్లు తెలుస్తోంది.
ప్రపంచ టెక్నాలజీ రంగంలో పెరుగుతున్న పోటీ, వ్యయాలను తగ్గించుకోవాల్సిన అవసరం, కార్యకలాపాలను ఒకే కేంద్రం నుంచి నిర్వహించాలనే వ్యూహంలో భాగంగానే శాంసంగ్ ఈ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టినట్లు నిపుణులు భావిస్తున్నారు. టెక్సాస్‌లోని ప్లానోను అమెరికా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మార్చడం ద్వారా నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా శాంసంగ్ తాజా నిర్ణయంతో అమెరికాలో 800 మందికి పైగా ఉద్యోగులపై ప్రభావం పడినట్లు సమాచారం. ఉద్యోగాల కోత, బదిలీలపై సంస్థ నిర్ణయం ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

















