మైసూరులో ఘోరం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య

ప్రతిపక్షం, జూలై 22: కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భార్య, ఇద్దరు చిన్నారులను హత్య చేసిన అనంతరం భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హున్సూరు పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మృతులను హరీష్ (39), ఆయన భార్య నిశ్చిత (37), కుమార్తెలు రక్ష (8), నక్ష (4)గా గుర్తించారు. హరీష్ ఓ బీమా సంస్థలో వాహనాల రికవరీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో అతను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడితో సతమతమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన వెనుక ఇతర వ్యక్తిగత లేదా కుటుంబ కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం, ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లోని బెడ్‌రూంలో భార్య, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు మంచంపై కనిపించాయి. వారి ముఖాలకు అంటుకునే టేప్ చుట్టి ఉండగా, ఇంటి పై అంతస్తులో హరీష్ ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో కనిపించాడు. ఘటన స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఆ సూసైడ్ నోట్‌లో తన మరణం అనంతరం లాకర్‌లో ఉన్న ఆస్తి పత్రాలు, అప్పులకు సంబంధించిన వివరాలు, వాటిని ఎవరికి అప్పగించాలనే సూచనలను హరీష్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. తాళం ఎక్కడ ఉంచారో, పత్రాలను ఎవరికి అందజేయాలో కూడా అందులో పేర్కొన్నట్లు తెలిపారు.

దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనకు మూడు రోజుల ముందే హరీష్ తన తల్లిని బంధువుల ఇంటికి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటనను ముందుగానే ప్రణాళికాబద్ధంగా అమలు చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హున్సూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు అసలు కారణాలు ఏమిటి, ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమా లేక ఇతర కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News