ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్, జూలై 21: 10 యేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, ఎందరో నిరుద్యోగుల ఉసురు పోసుకున్న కేటీఆర్కు మాట్లాడే అర్హత లేదని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో కేటీఆర్ దొంగ ఏడుపు ఏడుస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి గా పని చేసిన హరీష్ రావు కు కాళేశ్వరం కూలిపోయిన దాంట్లో భాధ్యత లేదా అన్నారు. ఈరోజు కరువు కరువు అంటూ హరీష్ ఏకరువు పెట్టడం దుర్మార్గమన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అంతా తానే నడిపిన కేసీఆర్ కాళేశ్వరాన్ని నిర్మించి వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఒకచోట కట్టాల్సిన ప్రాజెక్టును మరోచోట కట్టి కమీషన్ల దందా చేసిన కేసీఆర్ కుటుంబం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కాదా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 35 వేల ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏండ్ల లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని,వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మెజార్టీ హామీలను పూర్తి చేశామన్నారు. పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ఇలా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నామన్నారు.
రూ.20వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామని వివరించారు. విద్యావైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 పైగా ఇళ్లు ఇచ్చామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హుందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



















