ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ మహిళ.. ‘దయచేసి నన్ను భారత్‌కు తీసుకెళ్లండి’ అంటూ వేడుకోలు

ప్రతిపక్షం, జూలై 20: ఉద్యోగం పేరుతో ఒమన్‌కు వెళ్లిన హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌కు చెందిన షబ్నం బేగం అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తనను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఓ ఏజెంట్ తనను ఒమన్‌కు పంపించాడని, అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోయానని షబ్నం బేగం ఆరోపించారు. పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయించారని, మూడు నెలలుగా జీతం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ ఉపయోగించేందుకు కూడా అనుమతించలేదని తెలిపారు.

యజమానుల వేధింపులు, దాడులు భరించలేక అక్కడి నుంచి తప్పించుకుని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందినట్లు వెల్లడించారు. గత ఎనిమిది రోజులుగా ఎంబసీలోనే ఉంటున్నానని, తనలాంటి పరిస్థితుల్లో మరో 130 మంది మహిళలు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.

తనను ఒమన్‌కు పంపిన ఏజెంట్ పాస్‌పోర్ట్‌ను తీసుకుని తిరిగి ఇవ్వలేదని షబ్నం బేగం ఆరోపించారు. దీంతో స్వదేశానికి తిరిగి రావడంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తన పరిస్థితిని గుర్తించి భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సురక్షితంగా హైదరాబాద్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనను హైదరాబాద్‌కు చెందిన ఎంబీటీ నేత అహ్మదుల్లా ఖాన్ సామాజిక మాధ్యమం ద్వారా భారత విదేశాంగ శాఖ, ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. షబ్నం బేగంను వెంటనే సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. విదేశీ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News