రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కొడుకు ఎదుటే విషాదంస్కూటీ ఢీకొని కిందపడిన వ్యక్తిని ఢీకొట్టిన కారు

ఘటనా స్థలంలోనే వ్యక్తి మృతి

ప్రతిపక్షం, నంగునూరు, జూలై 11: సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు కళ్ల ముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజగోపాలపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరుకు చెందిన బీమా పవార్ (38), తన కుమారుడు అరవింద్ పవార్‌తో కలిసి జిల్లెల్ల గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం రాత్రి సుమారు 8 గంటల సమయంలో రాంపూర్ ఎక్స్‌ రోడ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా, బద్దిపడగ గ్రామం వైపు నుంచి నర్మెట సాయి నడుపుతున్న స్కూటీ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి తండ్రి, కుమారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో బీమా పవార్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో బద్దిపడగ వైపు నుంచి హైదరాబాద్‌కు చెందిన దాసు సంతోష్ కుమార్ నడుపుతున్న టీజీ36బీ7517 నంబర్ గల కారు అతివేగంగా వచ్చి రోడ్డుపై పడివున్న బీమా పవర్‌ను ఢీకొట్టింది. కారు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఆయనకు కాళ్లు, చేతులు, ముఖంపై తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

ప్రమాదంలో కుమారుడు అరవింద్‌కు గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో రాజగోపాలపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య మీనా పవార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాజగోపాలపేట ఎస్‌.ఐ. వివేక్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన స్కూటీ, కారు డ్రైవర్ల నిర్లక్ష్యంపై విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. నంగునూరు గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Spread the love

Related News

Latest News