ప్రతిపక్షం, జూలై 03: హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. తొలి దశలో రూ.7,345 కోట్ల వ్యయంతో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
భవిష్యత్తులో భారీ వరదలను దృష్టిలో ఉంచుకుని గరిష్ఠంగా 1.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సైతం తట్టుకునేలా మూసీ నది రూపకల్పనను సిద్ధం చేశారు. ఇందుకోసం నిపుణుల కమిటీలు, జాతీయ హైడ్రాలజీ సంస్థ సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
మొత్తం 55 కిలోమీటర్ల మూసీ కారిడార్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనుండగా, తొలి దశలో హిమాయత్‌సాగర్–బాపూఘాట్, ఉస్మాన్‌సాగర్–బాపూఘాట్ మధ్య 21 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టు నిధుల్లో సుమారు రూ.4,500 కోట్లను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి రుణంగా సమీకరించాలని, మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా విడుదల చేయాలని ప్రతిపాదించింది.
ఈ ప్రాజెక్టును ఈపీసీ విధానంలో అమలు చేయనున్న ప్రభుత్వం, పనుల పర్యవేక్షణ కోసం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 147 ప్రత్యేక పోస్టులకు కూడా ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు పూర్తయితే మూసీ నది పునరుజ్జీవంతో పాటు హైదరాబాద్ నగరానికి కొత్త రూపు రానుందని ప్రభుత్వం భావిస్తోంది.

















