భూపాలపల్లిలో వెలుగుచూసిన ఆన్‌లైన్ బెట్టింగ్ బాగోతం

జెన్ కో అధికారి హస్తంపై ఆరోపణలు

ప్రతిపక్షం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, జూన్ 19: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జెన్‌కోకు చెందిన ఓ కీలక అధికారి ఆధ్వర్యంలో ఆన్‌లైన్ బెట్టింగ్ దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార హోదాను అడ్డుపెట్టుకుని సదరు అధికారి సాగిస్తున్న ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలోని విద్యుత్ శాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ దందాలో భాగంగా సదరు అధికారి తన పరిధిలోని కిందిస్థాయి ఉద్యోగులను పావులుగా వాడుకుంటున్నారని తెలుస్తోంది. అమాయకులైన ఉద్యోగుల పేర్ల మీద ఉన్న బ్యాంక్ అకౌంట్లను బెట్టింగ్ లావాదేవీల కోసం ఆయన వాడుకుంటున్నారని సమాచారం. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటామని భయపడుతున్న సదరు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమ అకౌంట్లను దుర్వినియోగం చేస్తూ, అక్రమ లావాదేవీలకు తనను బలిపశువులను చేస్తున్నారంటూ లోలోపల గుబులు చెందుతున్నారు. పైస్థాయి అధికారి కావడంతో ఏమీ అనలేక, బయటకు చెప్పుకోలేక బాధితులు సతమతమవుతున్నారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అమాయక ఉద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News