Trending Now

గెలుపు గుర్రాలకే లోక్​సభ టికెట్లు..

అభ్యర్థుల ఎంపిక పక్రియ వేగవంతం..

ఖమ్మం, నల్గొండకు భారీగా ఆశావాహులు..

ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు నలుగురు పోటీ..

తాజాగా అభ్యర్థులపై సర్వే నిర్వహించిన సీఎం రేవంత్​

సర్వేలో ఎక్కువ మార్కులు వచ్చినే వారినే ఎంపిక..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: లోక్​సభ ఎన్నికల్లో సైతం అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే గెలుపు గుర్రాలనే కాంగ్రెస్​పార్టీ ఎంపిక చేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులపై సర్వే నిర్వహించి, సర్వేలో అధికంగా మార్కులు వచ్చిన వారినే ఎంపిక చేసిన నేపథ్యంలో లోక్​సభ ఎన్నికల్లో సైతం గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్​ వరించబోతున్నది. తెలంగాణలో లోక్​సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏఐసీసీ ఆదేశించింది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో జాప్యం కాకుండా చూడాలని ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పీసీసీకి సూచించారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ వడపోసిన జాబితాపై త్వరలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అర్హుల జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనుంది.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ గెలుపు గుర్రాలకే లోక్​సభ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్, కనీసం 14 స్థానాలను ఛేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను దీటుగా ఎదుర్కోగలిగే నాయకులనే లోక్​సభ ఎన్నికల బరిలో దించేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే లోక్​సభ టికెట్లు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న 309 మందిలో, కనీసం 50 మంది కూడా ప్రజాదరణ కలిగి, సత్తా ఉన్న నాయకులు లేరని ప్రాథమికంగా తేల్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్​సభ స్థానాల్లో వరంగల్‌, నాగర్​కర్నూల్‌, పెద్దపల్లి నియోజకవర్గాలు ఎస్సీలకు, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వ్‌డ్‌ స్థానాలు. మిగిలిన 12 లోక్​సభ నియోజకవర్గాల్లో కనీసం 5 స్థానాలను బీసీలకు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రిజర్వ్​డ్ స్థానాలు 5 పోగా భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కూడా మహబూబ్‌నగర్‌ లోక్​సభ స్థానానికి ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌ రెడ్డిని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డినే కోస్గి సభలో అభ్యర్థిగా ప్రకటించారు. అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపు నిచ్చారు. అంతేకాదు ఆయన్ను గెలిపిస్తే మరో రూ.5 వేల కోట్ల నిధులు నియోజకవర్గ అభివృద్ధికి తీసుకొస్తారని కూడా హామీ ఇచ్చారు.ఇక మిగిలిన 11 లోక్​సభ స్థానాల్లో హైదరాబాద్‌ ఎంఐఎం సిట్టింగ్‌ స్థానం. అక్కడ ఏ పార్టీ పోటీలో నిలబడినా పేరుకే ఉంటుందే తప్ప ఆ సీటుపై ఆధిపత్యం సాధించే అవకాశాలు తక్కువని చెప్పొచ్చు.

ఇక ఉండే పదింటిలో నల్గొండ, భువనగిరి, చేవెళ్ల నియోజక వర్గాలు దాదాపు రెడ్లకు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సికింద్రాబాద్‌, జహీరాబాద్‌, కరీంనగర్‌ నియోజకవర్గాలు బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన 4 నియోజకవర్గాల్లో మల్కాజిగిరి ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి సిట్టింగ్‌ స్థానం కావడం, అక్కడ ఎవరు నిలబడాలన్నది సీఎం రేవంత్‌ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడి హోదాలో నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి పోటీలో దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆయనకు కొన్ని నియోజకవర్గ నేతలు అడ్డుతగులుతున్నట్లు తెలుస్తోంది. మెదక్‌ నుంచి కేసీఆర్‌ కుటుంబం నుంచి పోటీలో దిగే అవకాశం ఉండటంతో అక్కడ పోటీ చేస్తామని దరఖాస్తు చేసిన వారిలో పీసీసీ అధికార ప్రతినిధి భవాని రెడ్డి, బండారు శ్రీకాంతరావులతో పాటు మరికొంత మంది ఉన్నప్పటికీ, వారి స్థాయి అక్కడ ఇతర పార్టీల నుంచి బరిలో దిగుతున్న నాయకుల బలాబలాల ముందు సరిపోదని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అక్కడ నుంచి బలమైన అభ్యర్థిని నిలబెట్టేందుకు పీసీసీ కసరత్తు చేస్తోంది.

ఇక ఖమ్మం లోక్​సభ నియోజకవర్గం అత్యంత పోటీ కలిగిన స్థానంగా చెప్పొచ్చు. రాజ్యసభకు ఎంపిక కావడంతో రేణుకా చౌదరి పోటీ నుంచి దూరమైనప్పటికీ, ఉమ్మడి ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఉపేందర్‌లు కూడా ఎన్నికల్లో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. దీంతో ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు బరిలో ఉంటామని చెబుతుండడం, టికెట్ కోసం పట్టుబడుతుండడంతో పాటు పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంత​రావు కూడా టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో పని చేసుకుంటూ పోతున్నట్లు వెల్లడించిన ఆయన, ఖచ్చితంగా ఖమ్మం నుంచి పోటీ చేసి తీరుతానని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికి ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌, 16 లోక్​సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర నాయకత్వం ఆచితూచి ముందుకు వెళ్లాల్సి వస్తోంది. నాగర్ కర్నూల్ లోక్​సభ నియోజక వర్గం టికెట్ తనకేనని మాజీ ఎంపీ మల్లు రవి చెబుతూ రావడం రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేసి పోటీలో నిలిచేందుకు సిద్ధపడడంతో ఎలా ముందుకు వెళ్లాలో పార్టీ నాయకత్వానికి దిక్కుతోచడం లేదు. అయినా కూడా టిక్కెట్ల విషయంలో రాజీలేని ధోరణిలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

Spread the love