ప్రతిపక్షం, జూన్ 09: నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దర్శనం కోసం హైదరాబాద్ కాచిగూడ ప్రాంతం నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు.
గల్లంతైన వారిని చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేశ్ కుమార్ (31)గా గుర్తించారు. నదిలో లోతును అంచనా వేయలేక నీటిలో చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనను గమనించిన గజ ఈతగాళ్లు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించగా, సమాచారం అందుకున్న పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి గల్లంతవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా, సురక్షితంగా బయటపడాలని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు.

















