ప్రతిపక్షం, జూలై 19: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చూడటమే తమ రాజకీయ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
జగ్గారెడ్డి ఆహ్వానం మేరకు చాలా సంవత్సరాల విరామం తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే తెలంగాణలో పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలక నాయకుడని, తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారని జగ్గారెడ్డి కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాజకీయంగా అండగా నిలిచారని, కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయనకు బలమైన అనుబంధం ఉందని ప్రశంసించారు.
మంత్రి పదవి అంశంపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి, తాను ఎప్పుడూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే తన లక్ష్యమని తెలిపారు. పదవుల విషయంలో పార్టీ అధిష్ఠానం, ముఖ్యంగా రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయమే తమకు తుది నిర్ణయమని చెప్పారు.
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల అంశంపై కూడా ఇద్దరు నేతలు స్పందించారు. ఆ వివాదం తమ సమావేశంలో ప్రధాన అంశం కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. స్థానిక సమస్యలను అక్కడి నాయకులే పరిష్కరించుకోవాలని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి సరదాగా స్పందిస్తూ, ఇలాంటి పంచాయితీలను పరిష్కరించే బాధ్యత జగ్గారెడ్డికే అప్పగిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. తుంగతుర్తి వ్యవహారం ఇప్పటికే ముగిసిన అంశమని కూడా ఆయన స్పష్టం చేశారు.
















