పేపర్ లీకుల పాలన మీదే..

  • యువతకు క్షమాపణ చెప్పండి
  • కేటీఆర్ ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 18: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువ సంగ్రామ సభలో చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, యువతను మభ్యపెట్టే రాజకీయ ప్రయత్నాలు ఇకపై సాగవని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని సిఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లురి మాట్లాడుతూ… యువ సంగ్రామ సభలో కనిపించింది నిరుద్యోగ యువత కాదని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, చెల్లింపు ప్రాతిపదికన తీసుకొచ్చిన వ్యక్తులేనని విమర్శించారు. “కేటీఆర్ గారూ… కబుర్లు కాదు… ప్రభుత్వ రికార్డులు మాట్లాడుతున్నయ్” అని వ్యాఖ్యానించారు.”మీది పేపర్ లీకుల పాలన… మాది కొలువుల జాతర” అని ఘాటుగా విమర్శించారు.బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల చేతిలో హాల్‌టికెట్ మాత్రమే ఉండేదని, పేపర్ లీకులు, పరీక్షల రద్దులు, కోర్టు కేసులతో లక్షలాది యువత జీవితాలను అనిశ్చితిలోకి నెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే యువత చేతిలో నియామక పత్రాలు పెట్టిందన్నారు.

ఉద్యోగం అంటే ప్రకటనలు కాదని, నియామక పత్రాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు.నోటిఫికేషన్ ఇచ్చి మర్చిపోయే ప్రభుత్వం కాదని, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించి, ఉద్యోగాలు కల్పించే బాధ్యతాయుత ప్రజా ప్రభుత్వం ఇదేనని స్పష్టం చేశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, కరీంనగర్ యువత కోసం కేటీఆర్ చేసిన ఒక్క పని అయినా చెప్పాలని సవాల్ విసిరారు. కొత్త అబద్ధాలతో విషప్రచారం చేయడం బీఆర్ఎస్‌కు అలవాటైందన్నారు. దమ్ముంటే అసెంబ్లీ వేదికపై అధికారిక గణాంకాలతో చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. రాజకీయ ఆరోపణలకు బదులుగా ప్రభుత్వ అధికారిక రికార్డులే సమాధానం చెబుతున్నాయని పేర్కొంటూ మంత్రి అడ్లూరి నియామకాల వివరాలను వెల్లడించారు.

Spread the love

Related News

Latest News