సింగరేణిని గత ప్రభుత్వాలే నష్టాల్లోకి నెట్టాయి.. కార్మికులకు అండగా కేంద్రం: కిషన్ రెడ్డి

ప్రతిపక్షం, జూలై 14: సింగరేణి సంస్థ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు, నష్టాలతో సతమతమవుతోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సంస్థ నష్టాలకు గత ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించిన ఆయన, సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సింగరేణి తెలంగాణకు గుండెచప్పుడు లాంటి సంస్థ అని పేర్కొన్న కిషన్ రెడ్డి, రాజకీయాలు చేయడానికి తాను రాలేదని చెప్పారు. గత ప్రభుత్వాల పాలనలో సంస్థ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కలిసి సంస్థ నిధులను దుర్వినియోగం చేశాయని ఆరోపించారు. కార్మికులకు సంబంధించిన రూ.54,079 కోట్ల నిధులు అప్పుల భారంగా మారాయని, సింగరేణి ఈ పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కారణమని పేర్కొన్నారు.

సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకే తాడిచెర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ బ్లాక్‌లో సుమారు 434 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగే అవకాశముందని వివరించారు.

తాడిచెర్ల-2 ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, సింగరేణి సంస్థ ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News