ప్రతిపక్షం, ఆగస్టు 04: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ చేరనుంది. రాయదుర్గంలో అత్యాధునిక స్ట్రీట్ ఫుడ్ హబ్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుండగా, ఇందుకోసం రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పరిపాలనా అనుమతులు పూర్తికాగానే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఫుడ్ హబ్‌లో 50కిపైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు దేశీయ, అంతర్జాతీయ రుచులను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నారు. సందర్శకుల కోసం విశాలమైన కూర్చునే ప్రదేశాలు, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రమైన వాతావరణం, ఆధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు.
ప్రత్యేకత ఏమిటంటే.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జానపద కళా ప్రదర్శనలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఫుడ్‌తో పాటు వినోదాన్ని ఆస్వాదించేలా ఈ హబ్‌ను రూపుదిద్దనున్నారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు స్టాల్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనతో స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఆహారం, ఉపాధి, సంస్కృతి, పర్యాటక రంగాలను ఒకే వేదికపై ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.
రాయదుర్గంలో ఏర్పాటుకానున్న ఈ మెగా స్ట్రీట్ ఫుడ్ హబ్ అందుబాటులోకి వస్తే, ఐటీ ఉద్యోగులు, నగరవాసులు, పర్యాటకులకు కొత్త ఫుడ్ డెస్టినేషన్‌గా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

















