ప్రతిపక్షం, జూలై 30, జోగులాంబ గద్వాల: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై, రిజర్వాయర్ భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో జూరాల ప్రాజెక్టు 10 స్పిల్‌వే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణా నది దిగువ ప్రాంతాల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుత వర్షాకాలంలో జూరాల ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లను తెరవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా నీటి విడుదలను నియంత్రిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, రైతులు కృష్ణా నది ఒడ్డునకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వరద పరిస్థితులపై అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

















