[t4b-ticker]

రైల్వే స్టేషన్లలో తాగునీరు సురక్షితమేనా? 56 స్టేషన్లలో ఈ-కోలి కలకలం

ప్రతిపక్షం, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందుతున్న తాగునీటి నాణ్యతపై కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో పలు రైల్వే జోన్లు విఫలమయ్యాయని పేర్కొంది. ముఖ్యంగా కొన్ని స్టేషన్లలో తాగునీరు కలుషితమైనట్లు తనిఖీల్లో బయటపడింది.

కాగ్‌ అధికారులు దేశవ్యాప్తంగా 56 రైల్వే స్టేషన్లలో తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షించగా.. వాటిలో ప్రమాదకర ఈ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ జాబితాలో హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీటి నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

అపరిశుభ్రంగా వాష్‌రూమ్‌లు

తాగునీటితో పాటు పలు రైల్వే స్టేషన్లలో వాష్‌రూమ్‌ల నిర్వహణ కూడా సరిగా లేదని కాగ్‌ గుర్తించింది. పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, సరైన నిర్వహణ లేకపోవడం వంటి లోపాలు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైనట్లు తెలిపింది. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన విషయంలో సంబంధిత రైల్వే జోన్లు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది.

ఈ అంశాలపై కాగ్‌ ఇటీవల పార్లమెంటుకు నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం తగదని, తాగునీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడంతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నివేదిక సూచిస్తోంది.

ఈ-కోలి వల్ల సమస్యలేంటి?

ఈ-కోలి బ్యాక్టీరియా సాధారణంగా మల కాలుష్యానికి సూచికగా పరిగణిస్తారు. కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తీవ్ర అనారోగ్యానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణికులు స్టేషన్లలో తాగునీరు, వాష్‌రూమ్‌లను వినియోగిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News