ప్రతిపక్షం, ఆగస్టు 09: తెలంగాణలోని హైదరాబాద్ నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దంటూ విద్యార్థులు వైస్ ఛాన్స్‌లర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నల్సార్ స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగించవద్దని విద్యార్థులు కోరినట్లు సమాచారం.
నల్సార్ విద్యార్థులు తమ లేఖలో నీట్ లీక్ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన నిరసనల సమయంలో సీజేఐ సూర్యకాంత్ వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థుల నిరసనలు, వారి అభిప్రాయాల విషయంలో ఆయన వైఖరిని తప్పుపడుతూ.. ఈ నేపథ్యంలో స్నాతకోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించకూడదని కోరినట్లు సమాచారం.
విద్యార్థులు రాసిన లేఖ ప్రస్తుతం వర్సిటీ వర్గాల్లో చర్చకు దారితీసింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సీజేఐను ఆహ్వానించడం నల్సార్‌లో చాలాకాలంగా కొనసాగుతున్న సంప్రదాయంగా ఉండగా.. తాజాగా విద్యార్థులు చేసిన ఈ అభ్యర్థనపై యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే విద్యార్థుల లేఖపై వర్సిటీ యాజమాన్యం నుంచి అధికారికంగా స్పందన రావాల్సి ఉంది. స్నాతకోత్సవానికి సంబంధించిన తుది నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.





























