ప్రతిపక్షం, మొయినాబాద్, జులై 23: చేవెళ్ల నియోజకవర్గంలోని భూ నిర్వాసితులకు, ప్లాటు బాధితులకు తక్షణమే పరిహారం శిశు అందించి న్యాయం చేయాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కిసాన్ వింగ్ స్టేట్ కన్వీనర్, భూనిర్వాసితుల సంఘం అధ్యక్షుడు నీరటి ఆంజనేయులు చేవెళ్ల ఆర్డీఓ పార్థ సింహారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. హిమాయత్‌నగర్‌లోని 290 ప్లాట్ల (60 గజాల) బాధితులకు న్యాయం చేయడంతో పాటు చందనవెల్లి, సీతారాంపూర్ భూబాధితులకు ఎకరాకు గుంట చొప్పున ప్లాట్లు కేటాయించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందించి ఆదుకోవాలని నేతలు ఆర్డీఓను కోరారు. ఈ వినతిపై ఆర్డీఓ పార్థసింహారెడ్డి సానుకూలంగా స్పందించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అర్హులైన భూబాధితులకు ఎకరాకు గుంట చొప్పున ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు జె. దుర్గాప్రసాద్, భూనిర్వాసితుల సంఘం సభ్యులు రాంబాబు గౌడ్, కె. నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


















