ప్రతిపక్షం, ఆగస్టు 04: తిరుపతి జిల్లాలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమెపై దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం వడ్డెర చెరువు గ్రామానికి చెందిన సురేష్‌కు ఐదేళ్ల క్రితం వెదురుకుప్పం మండలం మోర గ్రామానికి చెందిన కస్తూరితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది.
టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేష్, గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకుని తరచూ మద్యం మత్తులో ఆమెతో గొడవపడేవాడని స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన అతడు భార్యతో వాగ్వాదానికి దిగాడు.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో వంటగదిలో ఉన్న దోసె పెనంతో కస్తూరి తలపై బలంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















