ప్రతిపక్షం, సెప్టెంబర్ 01: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళలు, యువత, బలహీనవర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
రైతు సంక్షేమంలో భాగంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి సుమారు 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.20 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మొత్తాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి ఇప్పటివరకు రూ.36 వేల కోట్లు అందించామని చెప్పారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు.
సన్న వడ్లకు బోనస్ కోసం రూ.4 వేల కోట్లు, ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు, రైతు బీమా కోసం రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలను చేరువ చేశామని చెప్పారు.
యువతకు ఉపాధి కల్పనతో పాటు విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టామని, నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
సామాజిక న్యాయానికి కూడా తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా సామాజిక న్యాయం దిశగా కీలక అడుగు వేశామని చెప్పారు.
మహిళలు, వ్యవసాయ కూలీలు, బలహీనవర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజాపాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు.
బీఆర్ఎస్ నిరసనలకు ప్రజలే సమాధానం చెప్పాలి
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చేపడుతున్న నిరసనలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని, అందుకే రాజకీయ ప్రయోజనాల కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిన నేతలకు ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మంత్రులు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటిపై చెల్లించాల్సిన వడ్డీల భారంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలు, బలహీనవర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు.
బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ పదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.





























