హామీల అమలుపై దృష్టి పెట్టండి.
సీఎం పై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ధ్వజం.
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 01: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి మాజీ సీఎం కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి హితవు పలికారు. మంగళవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.‘‘నంది ఎవరో.. పంది ఎవరో మీ వెయ్యి రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్పై వ్యక్తిగత దూషణలకు దిగడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదన్నారు.తెలంగాణ ఉద్యమానికి రథసారథిగా నిలిచి ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకులు కేసీఆర్ అని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. వెయ్యి జన్మలెత్తినా కేసీఆర్ చేసిన పనులను చేయడం సాధ్యం కాదని అన్నారు. తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును చెరిపివేయడం ఎవరి తరమూ కాదన్నారు.హామీల అమలు ఏదీ?కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పూర్తిస్థాయి రుణమాఫీ, రైతుబంధు, మహిళల సంక్షేమం, నిరుద్యోగ భృతి తదితర హామీల పరిస్థితి ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ప్రచార ఆర్భాటాలను కాకుండా తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే పనితీరును కోరుకుంటున్నారని అన్నారు.పేదల ఇళ్ల కూల్చివేతే అభివృద్ధా?హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడం, మూసీ ప్రాజెక్టు పేరుతో భూ సమస్యలు సృష్టించడం అభివృద్ధి కాదని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. కేసీఆర్పై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.





























