[t4b-ticker]

నిద్రలో పాము కాటు.. 8వ తరగతి విద్యార్థి మృతి.. గద్వాలలో విషాదం

ప్రతిపక్షం, జోగులాంబ గద్వాల, జులై 30: జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైన ఓ 8వ తరగతి విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అయిజ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కే. తిరుమలేష్ (14) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని పాము కాటేయడంతో బాలుడి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై సమీపంలో చికిత్స కోసం ప్రయత్నించినప్పటికీ అత్యవసర వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే విష ప్రభావం తీవ్రంగా ఉండటంతో వైద్యుల చికిత్స ఫలించలేదు. చికిత్స పొందుతూ తిరుమలేష్ మృతి చెందాడు. చదువులో ప్రతిభ కనబరిచే బాలుడు అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేస్తున్నాయి.

ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటుకు వెంటనే చికిత్స అందించే కేంద్రాలు, యాంటీ స్నేక్ వెనం (ASV) మందులు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటే బాలుడి ప్రాణాలు కాపాడే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఒక కుటుంబానికి ఆశగా ఉన్న కుమారుడు క్షణాల్లో దూరం కావడంతో వెంకటాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతితో స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love

Related News

Latest News