ప్రతిపక్షం, ఆగస్టు 06: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శిథిలావస్థకు చేరిన తరగతి గదుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు మంజూరు చేసింది. పాఠశాల దుస్థితిపై ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించి, అవసరమైన మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ పాఠశాల ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిరతో ఫోన్‌లో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ దివాకర్ గురువారం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పాఠశాల అభివృద్ధి కోసం చొరవ చూపిన ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిరను అభినందించిన ఆయన, కొత్త తరగతి గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రకటన చేసిన వెంటనే నిధులను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన విద్యా వాతావరణాన్ని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.


















