ప్రతిపక్షం, ఆగస్టు 21: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కాల్చి చంపిన ఓ వ్యక్తి.. ఆ తర్వాత వాట్సాప్‌లో సంచలన స్టేటస్ పెట్టి, అందులో పేర్కొన్నట్లుగానే తన సోదరిని కూడా హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మానస్ మిశ్రా తన భార్య దివ్యా మిశ్రాను ఆమె పనిచేసే కార్యాలయం వెలుపల కాల్చి చంపాడు. దివ్య బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భార్యను హత్య చేసిన అనంతరం మానస్ తన వాట్సాప్‌లో ఆమెను ‘మోసం చేసినందుకు’ చంపినట్లు పేర్కొంటూ ఓ స్టేటస్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అంతటితో ఆగకుండా తన సోదరి షీబాను కూడా చంపి, తాను కూడా ప్రాణాలు తీసుకుంటానని ఆ స్టేటస్‌లో పేర్కొన్నాడు. అనంతరం ఇంటికి వెళ్లిన మానస్.. తన సోదరి షీబాను కాల్చి హత్య చేశాడు. ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అయితే హత్యలకు అసలు కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.
మరోవైపు హత్యకు గురైన దివ్య సోదరి ప్రగ్యా మిశ్రా లక్నోలో ప్రముఖ జర్నలిస్టుగా ఉన్నట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంధువులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.





























